పేదలకు అండగా అబ్దుల్ కలాం హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్!
లక్కవరపుకోట, సూర్య : పేదలకు అండగా నిలుస్తూ, సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న అబ్దుల్ కలాం హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. మండలంలోని రంగరాయపురం గ్రామ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ప్రతి నెలా నిరుపేదలకు క్రమం తప్పకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు రోగులకు తమ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మానవతా దృక్పథంతో సేవలందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక సహకారం అందిస్తున్న కోసూరి తాతారావు, పెద్దాయన యర్రాభవాని , రంగరాయపురం మాజీ సర్పంచ్ రామలక్ష్మి తదితరులకు ట్రస్ట్ అధ్యక్షుడు ఈశ్వర రాఘవ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఆర్థికంగా స్థితిమంతులైన వారు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై, తమకు చేతనైనంతలో పేదలకు సహాయం అందించాలని ఈశ్వర రాఘవ కోరారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఎంతో గొప్ప సేవ అని ఆయన పేర్కొన్నారు.