లైసెన్స్ లేకుండా టపాసుల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు!
సైదాపురం, మేజర్ న్యూస్ : సైదాపురం మండలంలో దీపావళి పండుగ వేళ బాణసంచా వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సైదాపురం పోలీసులు అప్రమత్తమయ్యారు. సంబంధిత అధికారుల నుంచి చట్టబద్ధమైన అనుమతులు, లైసెన్సులు లేకుండా టపాసులను నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ సందర్భంగా ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన పోలీసులు.. అనధికారికంగా బాణసంచా నిల్వ చేయడం, విక్రయించడం వల్ల అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. లైసెన్సులు పొందిన వ్యాపారులు సైతం ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సురక్షిత ప్రదేశాల్లో మాత్రమే బాణసంచా నిల్వ చేసి విక్రయించాలని స్పష్టం చేశారు. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రమాదకరంగా టపాసుల నిల్వలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. అదేవిధంగా ప్రజలు కూడా అనధికారికంగా టపాసులు విక్రయించే వారి వద్ద కొనుగోలు చేయవద్దని, ఎక్కడైనా అక్రమ నిల్వలు, విక్రయాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన వైఖరి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదు! దీపావళి వేడుకలు ప్రమాదరహితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని సైదాపురం సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.