BREAKING
కుమారుడి పుట్టినరోజు... దేవాలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి.. నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి! గ్రామంలో జలసిరి, అభివృద్ధి పనుల గుర్తింపు... కూలీలకు అవగాహన రెజీనా బ్రేకప్ వివాదం.. నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోయానంటూ నటి సంచలన నిజాలు! పేదలకు అండగా అబ్దుల్ కలాం హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్! వైసీపీకి ప్రత్యర్ధులు కూటమి కాదు పోలీసులే. వెల్దుర్తి సీహెచ్‌సీని తనిఖీ చేసిన ఎన్‌హెచ్‌ఎం బృందం రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జాతీయ ఆరోగ్య మిషన్‌ రాష్ట్ర బృందం పాతపట్నంలో ఎన్నికల అధికారుల ఘోర వైఫల్యం లైసెన్స్ లేకుండా టపాసుల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు! కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ మర్రిపాడు జడ్పీటీసీ అభ్యర్థి సిద్దంరెడ్డి వెంకటరమణమ్మ టాలీవుడ్ నటి సంచలన అరెస్ట్.. డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిచి బెదిరించి దోపిడీ చేసిన అతుల్య చంద్ర! ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి

ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పును అడ్డుకోలేరు : మంత్రి ఆనం

Select Suryaa Now
ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పును అడ్డుకోలేరు : మంత్రి ఆనం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నవంబర్ 6, 2026 : రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.  నేడు నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఎన్డీఏ కూటమి విజయాలు, బీసీలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యత, ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై మాట్లాడారు.  గత నెల రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రెండున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని తెలిపారు. ప్రజలకు చేరువైన పాలన అందించడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడమే ఎన్డీఏ కూటమి ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్, బీజేపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించామని చెప్పారు.

స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు రావాలంటే ఎన్నికలు సజావుగా జరగాలి  : మంత్రి ఆనం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే ప్రతి రూపాయి ప్రజలకు చేరాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా గతంలో స్థానిక సంస్థలకు సుమారు రూ.6,400 కోట్ల నిధులు అందాయని, ప్రస్తుత ఆర్థిక కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.12 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వివరించారు.  స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా పూర్తయితేనే కేంద్ర నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుందని, ఆ నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి గ్రామం, ప్రతి పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే ఎన్డీఏ కూటమి నిబద్ధత : మంత్రి ఆనం

బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని మంత్రి గుర్తుచేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు  తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి, రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో మరింత చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు.  బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో వైసీపీ నాయకులు కోర్టులను ఆశ్రయిస్తూ అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. అయినప్పటికీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.  నెల్లూరు నగర మేయర్ పదవిని బీసీ వర్గానికి చెందిన రూప్ కుమార్ యాదవ్‌కు కేటాయించడం బీసీలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. జనరల్ కేటగిరీకి వచ్చిన అవకాశాన్ని బీసీ వర్గానికి కల్పించడం ద్వారా బీసీలకు ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోందన్నారు. బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

వైసీపీ పాలనలో నామినేషన్లకే అడ్డంకులు.. నేడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు : మంత్రి ఆనం

గత వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలు చించడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని మంత్రి విమర్శించారు.  కానీ నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి, ప్రచారం నిర్వహించి, ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛను పొందారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు ఉండేలా, ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.  ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో పోటాపోటీగా ఎన్నికలు జరిగినప్పటికీ విజయం సాధించిన ప్రతి అభ్యర్థిని అభినందించామని, ఆత్మకూరు అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరినట్లు తెలిపారు.

నిన్న ఆత్మకూరు నియోజకవర్గం లో జరిగిన ఘటనలపై మంత్రి వివరణ

ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు ప్రతి మండలాన్ని, ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తాను స్వయంగా గడపగడపకు వెళ్లానని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు జరుగుతున్నట్లు సమాచారం అందిందని, ముఖ్యంగా ఒక పోలీసు కానిస్టేబుల్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఫిర్యాదు తన దృష్టికి వచ్చిందని వివరించారు.  ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే తాను అక్కడికి వెళ్లి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత పోలీసు సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని వివరించానని, అయితే డీఎస్పీ అక్కడికి చేరుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.  కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు జరుగుతున్నాయని పోలీసులకు తెలియజేసినా తగిన సహకారం అందలేదని ఆరోపించారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుమారు వంద మంది అనుచరులతో అక్కడికి వచ్చి తమను బెదిరించే ప్రయత్నం చేశారని, జరిగిన వాస్తవాలను పక్కదారి పట్టించేలా ఈ ఘటనను వివిధ రకాలుగా చిత్రీకరించారని విమర్శించారు.  అనంతసాగరం మండలంలో రిగ్గింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో తాను హుటాహుటిన అక్కడికి వెళ్లానని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది, పోలీసు భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

రౌడీయిజం, బెదిరింపులకు భయపడేది లేదు.. రాజకీయాల్లో హద్దులు దాటొద్దు : మంత్రి ఆనం

తన రాజకీయ అనుభవంలో సగం కూడా లేని నాయకులు రాజకీయాలు నేర్పించడానికి వస్తే సహించేది లేదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వరకు లాగుతామంటూ బెదిరింపులకు దిగడం, పోలింగ్ కేంద్రాల వరకు అనుచరులను తీసుకువచ్చి భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.  నెల్లూరు జిల్లాకు రాజకీయంగా ఎంతో చరిత్ర ఉందని, ఆనం కుటుంబానికి కూడా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉందని గుర్తుచేశారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.  నెల్లూరు జిల్లాలో గతంలో నాటుబాంబుల సంస్కృతిని ప్రోత్సహించిన చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసని, దోపిడీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆస్తుల కబ్జాలు, దౌర్జన్యాల ఆరోపణలపై సంబంధిత నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. NHAIకి సంబంధించిన రూ.145 కోట్ల వ్యవహారంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులకు దిగకుండా ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.

కార్యకర్తలపై దాడులను సహించేది లేదు : మంత్రి ఆనం

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి ఘర్షణలకు దిగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం సూచిస్తుంటారని మంత్రి తెలిపారు. కార్యకర్తల సంక్షేమం, భద్రత పట్ల ముఖ్యమంత్రికి ఎంతో నిబద్ధత ఉందన్నారు.  అయితే చేజర్ల మండలంలో చంద్రశేఖర్ అనే వైసీపీ నాయకుడి అనుచరులు అల్లర్లు సృష్టించి కొందరిపై దాడులకు పాల్పడినట్లు సమాచారం ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది వైసీపీ నాయకుల దౌర్జన్య వైఖరికి నిదర్శనమన్నారు.  మేము గతంలో మాదిరిగా రాక్షస పాలనలో లేమని, రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నామని స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవిస్తూ పాలన అందిస్తున్నామని, రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజల విశ్వాసమే ఎన్డీఏ కూటమి విజయానికి పునాది : మంత్రి ఆనం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నేతలందరం ఒకే మాటపై నిలబడి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా ముగియడం, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి ఉన్నందునే ఎన్నికల్లో ఘన విజయం సాధించామని తెలిపారు.  వైసీపీ నాయకులు ఎన్నికలు ప్రశాంతంగా జరగడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని, విధ్వంసకర రాజకీయాలను కాదని స్పష్టం చేశారు.  రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందేలా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.