చేతుల మీదుగా..‘ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల’కు భూమిపూజ - రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో.
.హైదరాబాద్, 19 అక్టోబర్ 2026: ఏడు వేల మంది నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆధునిక విద్యా మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డీ పోచంపల్లిలో రౌండ్ టేబుల్ ఇండియా - ఏరియా 9 ఆధ్వర్యంలో నిర్మించనున్న 'ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల'కు ప్రభుత్వ మెట్రోపాలిటన్ ఏరియా & పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను చేరువ చేయడంతో పాటు వారికి విస్తృత అవకాశాలు కల్పించే లక్ష్యంతో
ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిన రౌండ్ టేబుల్ ఇండియా - ఏరియా 9 ప్రతినిధులను అభినందించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ ఈ పాఠశాల పరిసర ప్రాంతాల్లోని పిల్లలు, వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అందరూ పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ ఇండియా - ఏరియా 9 (2026–27) చైర్మన్ అనిరుధ్ సోంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దాదాపు ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్పారు. చాలా మంది పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నాణ్యమైన విద్య, మౌలిక వసతులను ఈ ప్రాంత ప్రజల ముంగిట్లోకి తీసుకు రానుందన్నారు. బడిలో విద్యార్థుల నమోదును, నిరంతర విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విశాలమైన తరగతి గదులు, సైన్స్, స్టెమ్ ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, గ్రంథాలయం, మరుగుదొడ్లు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇది కేవలం ఒక పాఠశాల నిర్మాణం మాత్రమే కాదని, వేలాది కలలకు వేస్తున్న పునాది అన్నారు. ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య పొందే హక్కు ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే తరాల పిల్లలకు సేవలందిస్తూ సమాజానికి ఒక గొప్ప వారసత్వాన్ని మిగిల్చే విద్యాసంస్థను నిర్మించడమే రౌండ్ టేబుల్ ఇండియా – ఏరియా 9 లక్ష్యమన్నారు. అవసరమైన అనుమతులు, నిర్మాణ పనులు పూర్తికావడం బట్టి త్వరలో ఈ పాఠశాలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో మౌలిక వసతుల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది తమ అభిమతమన్నారు. ఈ కార్యక్రమంలో ఇమేజ్ హాస్పిటల్స్ & సీవీఆర్ న్యూస్ చైర్మన్ సీవీ రావు, ప్రెస్స్టీల్స్ & ఫ్యాబ్రికేషన్స్ డైరెక్టర్ వనజ సోంపల్లి పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్న నిబద్ధతతో రౌండ్ టేబుల్ ఇండియా 'ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్' కింద చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఈ వేడుక నాంది పలికింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సేవలు అందించే ఒక ఆధునిక విద్యా సంస్థగా ఇది రూపుదిద్దుకోనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు అవసరమైన మౌలిక వసతులు, అనుకూల అభ్యాస వాతావరణాన్ని సమకూరుస్తుంది.
ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా - ఏరియా 9 సెక్రటరీ & ట్రెజరర్ అభిషేక్ అగర్వాల్, ఏరియా వైస్ చైర్మన్ బీ లోకేశ్వర్ రెడ్డి, ఇమీడియట్ పాస్ట్ ఏరియా చైర్మన్ కౌశిక్ యక్కల, నిర్మల్ ఉప్పుగుండ్ల (ప్రాజెక్ట్ మెంటర్), చైతన్య చిన్నం, భరత్ వర్మ ఉద్దరాజు, పట్టాభి రామయ్య, గౌరవ్ అగర్వాల్, ఉమంగ్ డాగా, తాడి సందీప్ రెడ్డి, సుధాన్షు షా, దిలీప్ అరవింద్, జాతీయ గౌరవ టేబులర్ ఆశిష్ సొంతాలియా పాల్గొన్నారు. ఈ పాఠశాల నిర్మాణ ప్రణాళిక, ఆర్కిటెక్చరల్ డిజైన్‌ను 'మేక్స్పేస్ ఆర్కిటెక్ట్స్'కు చెందిన రజత్ సంఘ్వీ రూపొందించారు.
విద్య ద్వారా ఉజ్వల భవిత నిర్మాణం అనే లక్ష్యంతో పిల్లలకు సురక్షితమైన, సమ్మిళిత, ఉత్తేజకరమైన అభ్యాస వాతావరణాన్ని అందించే ఒక సమగ్ర విద్యా ప్రాంగణంగా రూపుదిద్దుకుంటుంది. కేవలం తరగతి గదుల నిర్మాణానికే పరిమితం కాకుండా ప్రాథమిక విద్యను పటిష్టం చేయడం, విద్యాభివృద్ధిని ప్రోత్సహించడం, మౌలిక వసతుల కొరత లేకుండా పిల్లలు తమ ఆశయాలను నెరవేర్చుకునే అవకాశాలను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. రౌండ్ టేబుల్ ఇండియా తన ప్రతిష్టాత్మక 'ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్' కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా విద్యా మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తోంది. రాబోయే తరాల పిల్లలకు ప్రయోజనం చేకూర్చే ఒక శాశ్వత విద్యా సంస్థగా మార్చడానికి సిద్ధంగా ఉంది.