- ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి --- జీవో 1195పై పునఃసమీక్ష చేయాలి.. ---ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి — బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు
ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్) : రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 17 వేల మంది నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, వారి వేతనాలు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 1195 అమలుతో ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను సమీక్షించి, వారికి న్యాయం చేయాలని కోరారు.ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో సోమవారం నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించిన దేవకి వాసుదేవరావు వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో సుమారు 570 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ప్రజలకు వైద్య సేవలందిస్తున్నప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విచారకరమన్నారు.
--కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందా?
ఎన్‌హెచ్‌ఎం నిధుల వాటాలో కేంద్ర ప్రభుత్వం తన 60 శాతం వాటాను విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 40 శాతం నిధులను సకాలంలో విడుదల చేయడం లేదని దేవకి వాసుదేవరావు విమర్శించారు. కేంద్రం తన బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను సక్రమంగా విడుదల చేసి ఉద్యోగుల వేతనాలు, ప్రజారోగ్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల విడుదలలో జాప్యం చేస్తూ ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. నిధుల విడుదల, వేతనాల చెల్లింపుల విషయంలో స్పష్టత తీసుకురావడంతో పాటు, ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
---క్రమబద్ధీకరణ హామీ ఏమైంది? కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి!
ఎన్నికల సమయంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని దేవకి వాసుదేవరావు విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
---జీవో 1195పై పునఃసమీక్ష చేయాలి
జీవో 1195 అమలుతో వేతనాల విషయంలో ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. వేతనాలకు సంబంధించిన నిబంధనలను సమీక్షించి, ఉద్యోగులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, వేతనాలు, వార్షిక ఇంక్రిమెంట్లు, ఇతర సేవా ప్రయోజనాలపై స్పష్టమైన విధానం ప్రకటించాలన్నారు.
---కరోనా సేవలను గుర్తించి ఉద్యోగులకు న్యాయం చేయాలి
కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేసిన సేవలు మరువలేనివని దేవకి వాసుదేవరావు కొనియాడారు. అలాంటి ఉద్యోగులు నేడు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కాల్సి రావడం విచారకరమన్నారు. ప్రజారోగ్య వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు కీలక బాధ్యతల్లో ఉన్నప్పటికీ, సుమారు 570 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేయాల్సి రావడం గమనార్హమన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరిపి, నిధుల విడుదల, వేతన సమస్యలు, క్రమబద్ధీకరణ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని దేవకి వాసుదేవరావు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలుస్తామని, క్రమబద్ధీకరణతో పాటు న్యాయమైన హక్కుల సాధన కోసం తమ మద్దతు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకటేశ్వర్లు,పాలేపు రాము, వల్లాల రమేష్, ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు డాక్టర్ మానస, అశోక్, తదితరులు పాల్గొన్నారు..