సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..!
సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ అక్టోబర్ 20:
ఒకప్పుడు ఎన్నికల నినాదాలుగా, గోడలపై రాతలుగా మిగిలిన రైలు, గోదావరి జలాలు, ప్రత్యేక జిల్లా కలలను ప్రజల ఆశీస్సులతో సాకారం చేసుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటను ఉన్నత విద్యాలయాల కేంద్రంగా తీర్చిదిద్దామని, ఇక సాధించాల్సింది యూనివర్సిటీ మాత్రమేనని, త్వరలోనే దానిని కూడా సాధించి తీరుతామని ప్రకటించారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, రంగదాంపల్లి, ఎన్సాన్‌పల్లి, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దసరా ఉత్సవాలు, రావణ దహన కార్యక్రమాల్లో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుర్గామాత, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, జమ్మి పూజ అనంతరం రావణ దహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, యువత, మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
రైలు, గోదావరి జలాలు, జిల్లా.. కలలు సాకారం
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి అభివృద్ధి ప్రస్థానం వరకు సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ నాయకత్వంలోని మలిదశ ఉద్యమం వరకు సిద్దిపేట ముందుండి పోరాడిందని గుర్తుచేశారు.
ఒకప్పుడు సిద్దిపేటకు రైలు రావాలని, గోదావరి జలాలు పారాలని, ప్రత్యేక జిల్లా కావాలని ప్రజలు ఆకాంక్షించేవారని పేర్కొన్నారు. నేడు ఆ మూడు కలలు సాకారమయ్యాయని అన్నారు. సిద్దిపేట సమీపంలో రైలు పరుగులు తీస్తుండటం అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. సుమారు రూ.400 కోట్లతో రైల్వే విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయని, మరో ఏడాది లేదా రెండేళ్లలో విద్యుత్ రైళ్ల ద్వారా సిద్దిపేట నుంచి ఢిల్లీ, తిరుపతికి నేరుగా ప్రయాణించే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోదావరి జలాలతో సాగునీటి భరోసా
రాష్ట్రవ్యాప్తంగా కరువు, ఎల్‌నినో ప్రభావంపై చర్చ జరుగుతున్నప్పటికీ సిద్దిపేటలో తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్నసాగర్ జలాలు ప్రధాన కారణమని హరీశ్ రావు పేర్కొన్నారు. గౌరవెల్లి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, అనంతగిరి రిజర్వాయర్లతో సిద్దిపేట జలవనరుల కేంద్రంగా ఎదిగిందన్నారు.
గతంలో వందల అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు లభించని పరిస్థితులు ఉండేవని, బతుకమ్మ పండుగ సమయంలో చెరువుల్లో నీరు లేక మహిళలు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. నేడు గోదావరి జలాలతో కోమటిచెరువు సహా జలవనరులు కళకళలాడుతున్నాయని అన్నారు.
గతంలో సిద్దిపేటలో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, గోదావరి జలాల రాకతో బీడు భూములు సాగులోకి వచ్చి గత ఏడాది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి స్థాయికి చేరుకున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం రైతుల కృషికి నిదర్శనమన్నారు.
అభివృద్ధిలో కొత్త దిశ
గతంలో చిన్నచిన్న పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుతో పరిపాలనా సౌకర్యాలు మెరుగుపడ్డాయని హరీశ్ రావు అన్నారు.
ఒకప్పుడు మురికి కాలువలు, ఇరుకైన రహదారులతో ఇబ్బందులు ఎదుర్కొన్న పట్టణం నేడు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రహదారులు, డివైడర్లు, పచ్చదనంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సిద్దిపేటను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పేదింటి బిడ్డలకూ వైద్య విద్య
సిద్దిపేటను ఉన్నత విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, పీజీ, మహిళా డిగ్రీ, వ్యవసాయ, వెటర్నరీ విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకొచ్చామని హరీశ్ రావు వివరించారు.
పేదరికం వైద్య విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థినులు సైతం ఎంబీబీఎస్ చదువుతూ వైద్యులుగా ఎదగడం సంతోషకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వైద్య విద్య విస్తరణ చర్యలు పేద విద్యార్థుల కలలకు బాటలు వేశాయని పేర్కొన్నారు.
త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ
రైలు వచ్చింది, గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి, ప్రత్యేక జిల్లా ఏర్పాటైంది, విద్యాసంస్థల కేంద్రంగా సిద్దిపేట ఎదిగిందని హరీశ్ రావు అన్నారు. ఇక సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో త్వరలోనే యూనివర్సిటీని సాధించి తీరుతామని హామీ ఇచ్చారు.
నర్సాపూర్‌లో గత 37 ఏళ్లుగా శక్తి సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో, రంగదాంపల్లిలో హనుమాన్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువత సంప్రదాయబద్ధంగా దసరా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయదశమి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు తీసుకురావాలని, సిద్దిపేట మరింత అభివృద్ధి చెందాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సూర్య న్యూస్ : సిద్దిపేట అర్బన్, రిపోర్టర్ - దేవులపల్లి భూపతి