దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు
విజయవాడ, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు తెలిపారు. విజయదశమి సందర్భంగా కృష్ణానది తీరంలోని దుర్గాఘాట్‌లో నిర్వహించిన తెప్పోత్సవానికి ముందు అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపులో ఆయన ఇతర పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా, దర్శనాలు సులభతరం చేసేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టారు. మోడల్ గెస్ట్ హౌస్‌లోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించారు. రద్దీ ఎక్కువగా ఉన్న సీతమ్మవారి పాదాలు ఘాట్, వినాయకుడి గుడి పరిసర ప్రాంతాల్లో కమిషనర్ స్వయంగా పర్యటించి, విధుల్లో ఉన్న అధికారులకు తగిన సూచనలు చేశారు. కీలకమైన మూలా నక్షత్రం, విజయదశమి రోజుల్లో తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఉత్సవాల నిర్వహణలో అహోరాత్రులు శ్రమించిన పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సదుపాయాలు కల్పించిన కమిషనర్‌కు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.