స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు
నాగర్‌కర్నూల్, సూర్య ప్రతినిధి :తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గ్రామస్థులతో కలిసి విజయదశమి వేడుకలను అత్యంత ఆత్మీయంగా, వైభవంగా జరుపుకున్నారు. తన సొంత ఊరి ప్రజల మధ్య పండుగ సంబరాల్లో పాల్గొంటూ పెద్దలను, చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, పల్లె ప్రజలతో ముచ్చటిస్తూ దసరా ఆనందాన్ని పంచుకున్నారు.
ముఖ్యమంత్రి రాకతో కొండారెడ్డిపల్లి గ్రామంలో పండుగ శోభ మరింత సంతరించుకుంది. గ్రామానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్థులు, అభిమానులు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం వేళ ఆయన కుటుంబ సమేతంగా గ్రామంలోని కోట మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి కాలినడకన బయలుదేరిన ముఖ్యమంత్రి.. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ జమ్మి చెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ సంప్రదాయబద్ధంగా శమీ పూజ (జమ్మి పూజ) నిర్వహించారు. గ్రామస్థుల బతుకమ్మ ఆటపాటలు, సంప్రదాయ ఆచారాల మధ్య ఆత్మీయతకు, పల్లె సంస్కృతికి ప్రతీకగా సాగిన ఈ దసరా వేడుకలు కొండారెడ్డిపల్లిలో పండుగ ఉత్సాహాన్ని నింపాయి.