telangana
భారీగా దేశీదారు మద్యం పట్టివేత
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆదిలాబాద్ అధికారులు, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ దేశీదారు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.మహారాష్ట్ర నుంచి దేశీదారు మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పెండల్వాడ గ్రామ శివారు ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పింపల్ కూటి ప్రాంతం నుంచి పెండల్వాడ గ్రామానికి నడక మార్గంలో తలపై దేశీదారు మద్యం పెట్టెలను మోసుకొస్తున్న కొందరు వ్యక్తులు అధికారులను చూసి మద్యం పెట్టెలను వదిలి పరారయ్యారు.పారిపోయిన వారిలో పెండల్వాడ గ్రామానికి చెందిన బాబనే కృష్ణవాస్, లాండే మారుతి, లాండే సునీల్, తత్వ రాజు, బాబనే సుభాష్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.అనంతరం స్వాధీనం చేసుకున్న మద్యం పెట్టెలను లెక్కించగా 90 ఎం.ఎల్. పరిమాణం గల 400 బాటిళ్లు (36 లీటర్లు), 180 ఎం.ఎల్. పరిమాణం గల 168 బాటిళ్లు (30.24 లీటర్లు) ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 66.24 లీటర్ల దేశీదారు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ దాడుల్లో ఆదిలాబాద్ ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారి ఆకుల శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆదిలాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ క్రావత్ కుమార్, సిబ్బంది మధు, వెంకటేష్, హరీష్, బీరయ్య పాల్గొన్నారు.