నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవి ముస్లింకు కేటాయించండి.
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిని ముస్లిం వర్గానికి కేటాయించాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య శాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ముస్లిం లు కూటమి విజయానికి విశేషంగా సహకరించారని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వారి రాజకీయ భాగస్వామ్యాన్ని, కూటమిపై ఉంచిన నమ్మకాన్ని గుర్తించి డిప్యూటీ మేయర్ పదవిని ముస్లిం వర్గానికి కేటాయించడం సముచితమని అన్నారు. అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తుందని, నగర అభివృద్ధిలో ప్రతి వర్గం భాగస్వామ్యాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిం ల ఆకాంక్షను పరిగణనలోకి తీసుకుని, నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిని ముస్లిం వర్గానికి కేటాయించాలని అబ్దుల్ అజీజ్ అధినాయకత్వాన్ని కోరారు.