లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం.. భార్యకు తీవ్ర గాయాలు
గాజువాక, సూర్య : జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. గాజువాక పరిధిలోని షీలానగర్ బస్టాప్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపాలపట్నం వెంకటాపురం ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన సీరపు ఈశ్వరరావు (46) రాడ్ బెండింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం ఆయన తన భార్య గాయత్రీదేవి (35)తో కలిసి ద్విచక్రవాహనంపై సొంత పనిమీద పాత గాజువాకకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా, ఉదయం 8:50 గంటల సమయంలో షీలానగర్ బస్టాప్ వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోగా, లారీ చక్రాలు ఈశ్వరరావుపై నుంచి వెళ్లడంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య గాయత్రీదేవిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. మృతుడి సోదరుడు సీరపు వరహాలురెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.