మేకపాటి కోటలో ఎగిరిన పసుపు జెండా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం
మర్రిపాడు, మేజర్ న్యూస్: మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉన్న మర్రిపాడు మండలం పసుపుమయంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలతో పాటుగా జడ్పీటీసీ స్థానాన్ని కూడా టీడీపీ శనివారం విడుదలైన ఫలితాల్లో కైవసం చేసుకుంది. మర్రిపాడు మండలంలో 13 సెగ్మెంట్లుగాను 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసింది. ఫలితంగా ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులకు మింగుడు పడనంత పని అయింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. దీంతోపాటుగా పుట్టం సోదరులైన పుట్టం శ్రీనివాసులు రెడ్డి పుట్టం బ్రహ్మానందరెడ్డిలు రాజకీయ వ్యూహాన్ని ప్రయోగించారు. అటు మంత్రి ఆశీస్సులు, పుట్టం సోదరుల వ్యూహాత్మకాలు ఒక ఎత్తు అయితే ఇటు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలు మరో ఎత్తుగా భావించి ప్రజలు ఆశీర్వదించడంతో పసుపు జెండా విజయకేతనం ఎగురవేసింది. మండల పరిధిలోని 13 స్థానాలకు గాను కేవలం చుంచులూరు, ఇర్లపాడు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. మిగిలిన 11 స్థానాల్లో సింగనపల్లి, బూదవాడ, ఏపిలగుంట, నందవరం, భీమవరం, పొంగూరు, పల్లవోలు స్థానాలు ఎన్నికలు జరగకుండానే తొలి దశలోనే ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన ఆరు స్థానాలైన పడమటినాయుడుపల్లి, చుంచులూరు, బ్రాహ్మణపల్లి, ఇర్లపాడు, డీసీపల్లి, చినమాచనూరు స్థానాల్లో ఎన్నికలు జరగగా ఇర్లపాడు, చుంచులూరు స్థానాల్లో మాత్రమే వైసిపి విజయం సాధించింది. దీంతో 11 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
సొంత సెగ్మెంట్ లోను ఓటమి..
మేకపాటి కుటుంబం సొంత మండలమైన మర్రిపాడు మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో కేవలం రెండు స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ సొంత సెగ్మెంట్ అయిన బ్రాహ్మణపల్లి సెగ్మెంట్ లోను చుక్కెదురయ్యింది. ఈ బ్రాహ్మణపల్లి ప్రాదేశికం నుంచి ఓటమిపాలవ్వక తప్పలేదు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉదయగిరి వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ సెగ్మెంట్ టీడీపీ పార్టీ కైవసం చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ మర్రిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది.