గన్నవరం ..గరం..గరం..
విజయవాడ:కృష్ణా జిల్లా గన్నవరం స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్ సీపీ (వైసీపీ) అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రచారం జరగడంతో, ఆ ఫలితంపై అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ కూటమి నేతలు రీకౌంటింగ్ నిర్వహించాలని రీటర్నింగ్ అధికారిని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్ పిటిషన్‌పై అధికారులు సమీక్షిస్తుండటంతో గన్నవరం జెడ్పీటీసీ తుది ఫలితం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం వెలుపల కూటమి, వైసీపీ శ్రేణులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత పెరిగింది. విషయం తెలుసుకున్న వైసీపీ వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెంటనే కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. రీకౌంటింగ్ డిమాండ్, ఇరువర్గాల మోహరింపుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కౌంటింగ్ కేంద్రం వద్ద అదనపు బలగాలను రంగంలోకి దించి భద్రతను కట్టుదిట్టం చేశారు.