telangana
తేజాపూర్,నాగమల్యాల్‌లో ఘనంగా ఆదివాసీల దండారి ఉత్సవాలు
సూర్య నేరడిగొండ : మండలంలోని తేజపూర్ నాగమల్యాల్ లకం పూర్ రోల్ మామడ గ్రామాలలో దండాలు ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీల ఆచారాలు, సనాతన సంస్కృతికి ప్రతీకగా నిలిచే చారిత్రక దండారి (గుస్సాడి) ఉత్సవాలు అత్యంత వైభవంగా, జరిగాయి. ప్రకృతి మాతను ఆరాధిస్తూ, గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ వేడుకల్లో గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో నాగమల్యాల్ సర్పంచ్ గోడం నందిని అమృత్, లఖంపూర్ సర్పంచ్ సేడ్మాకి సుజాత గంగాధర్, పీచర సర్పంచ్ బైరి రాజేందర్, నాగమల్యాల్ పటేల్ కోవా గంగారాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు ఆయా గ్రామాల దేవరీలు, గ్రామ పెద్దలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.ఆదివాసీల అరుదైన ఆచారాలు, విశిష్ట సంప్రదాయాలను భావితరాలకు సజీవంగా అందించడంలో దండారి-గుస్సాడి నృత్యాలు ఎంతోప్రత్యేకమైనవి. డప్పు చప్పుళ్లు, గుస్సాడి నృత్యాలు, సంప్రదాయ వస్త్రధారణతో గ్రామమంతా కోలాహలంగా మారింది. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా సాగిన ఈ దండారి ఉత్సవాలు గిరిజన గ్రామాలలో ఘనంగా జరుపుకుంటున్నారు.