చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు!
పటాన్‌చెరు: పండుగ అంటే కేవలం మన ఇంట్లోనే ఆనందం నింపుకోవడం కాదు.. నలుగురి జీవితాల్లో సంతోషాన్ని పంచుకోవడమే అసలైన పండుగ స్ఫూర్తి అని ఎండీఆర్ ఫౌండేషన్ మరోసారి చాటిచెప్పింది. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపాలనే లక్ష్యంతో పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొల్లారం డిజైర్ సొసైటీలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ చిన్నారులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రతి దీపావళి సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆనందాన్ని పంచుతూ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా చిన్నారులకు టపాసులు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి టపాసులు కాలుస్తూ, సరదాగా గడుపుతూ పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. చిన్నారుల ముఖాల్లో కనిపించే చిరునవ్వుల కంటే విలువైనది మరొకటి లేదని అన్నారు. వారి ఆనందమే తనకు నిజమైన పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, ఆశలు, వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. సమాజంలో ఆనందాన్ని పంచే ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎండీఆర్ ఫౌండేషన్ తరఫున నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.టపాసులు అందుకున్న చిన్నారులు ఆనందంతో “ధన్యవాదాలు అన్నయ్య.. దీపావళి శుభాకాంక్షలు” అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నారుల కేరింతలు, చిరునవ్వులు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య వేడుకలు ఆహ్లాదకరంగా సాగాయి.పండుగల అసలైన పరమార్థం ఆనందాన్ని పంచుకోవడమేనని నిరూపిస్తూ, గత ఎనిమిదేళ్లుగా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎండీఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.ఎండీఆర్ ఫౌండేషన్ – వెలుగులు పంచే చేతులు.. చిరునవ్వులు సృష్టించే మనసులు!