అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ?
సూర్య – జూలపల్లి:
జూలపల్లి మండల కేంద్రంలో రూ.4.82 కోట్ల ప్రభుత్వ నిధులతో చేపట్టిన రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. రహదారి నిర్మాణానికి అవసరమైన మొరం తరలింపు పేరుతో పెద్దాపూర్ గ్రామ శివారులోని రాజుల గుట్టలో భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధిక లోడుతో టిప్పర్ల రాకపోకల కారణంగా జూలపల్లి ప్రధాన రహదారి దుమ్ముతో నిండిపోతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరుతో సహజ వనరుల విధ్వంసం జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దుమ్ముతో జనాలకు ఇక్కట్లు..
రాజుల గుట్ట నుంచి ఆదివారం సైతం సుమారు పది టిప్పర్ల ద్వారా మొరం తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. అధిక లోడుతో టిప్పర్లు రాకపోకలు సాగించడంతో రహదారిపై దుమ్ము విపరీతంగా వ్యాపిస్తోంది. ఇళ్ల ముందు, పరిసర ప్రాంతాల్లో దుమ్ము పేరుకుపోవడంతోపాటు ఇళ్లలోకి సైతం చేరుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగ రోజున కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సమయంలో రహదారిపై నీటిని చల్లి దుమ్ము నియంత్రించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుట్ట స్వరూపాన్నే మార్చేస్తున్నారా?
మొరం తవ్వకాల కోసం రాజుల గుట్టలో ప్రొక్లెయిన్ 220 వంటి భారీ యంత్రాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. తవ్వకాల క్రమంలో పెద్దపెద్ద వృక్షాలను సైతం తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గుట్ట సహజ స్వరూపం మారిపోవడమే కాకుండా వృక్ష సంపద, జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం సహజ వనరులను వినియోగించుకోవడంలో నిబంధనలు పాటించాల్సి ఉన్నప్పటికీ, ఇక్కడ అవి అమలవుతున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఏదీ?
రూ.4.82 కోట్లతో చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను ఆర్అండ్బీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. అయితే శుక్ర, శని, ఆదివారాల్లో ఏఈ నుంచి ఈఈ స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ ఏఈ అన్వేష్‌ను ఫోన్లో సంప్రదించగా డివిజన్ స్థాయి సమావేశంలో ఉండటంతో క్షేత్రస్థాయికి రాలేదని తెలిపినట్లు సమాచారం. అయితే కాంట్రాక్టర్ సూపర్వైజర్ మాత్రం మధ్యాహ్నం ఏఈ వచ్చి వెళ్లారని చెప్పడం గమనార్హం. దీంతో అధికారుల పర్యవేక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా?
ప్రభుత్వ పనులకు మొరం వినియోగిస్తున్నారనే కారణంతో గుట్టలో తవ్వకాలు, రవాణాకు సంబంధించిన నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందా? తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? ఎంత పరిమాణంలో మొరం తరలించేందుకు అనుమతి ఇచ్చారు? రాయల్టీ చెల్లింపులు జరిగాయా? టిప్పర్లలో నిర్దేశిత పరిమితికి మించి లోడింగ్ చేస్తున్నారా? వృక్షాల తొలగింపునకు సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
మైనింగ్ శాఖ అధికారులు తవ్వకాల అనుమతులు, రాయల్టీ, రవాణా పత్రాలను పరిశీలించాల్సి ఉండగా, అటవీ, పర్యావరణ శాఖలు వృక్ష సంపదకు జరుగుతున్న నష్టంపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆర్అండ్బీ అధికారులు నిర్మాణ పనుల నాణ్యత, రవాణా కారణంగా రహదారికి కలిగే నష్టంపై దృష్టి సారించాల్సి ఉంది.
ఫిర్యాదు చేసినా స్పందన కరువు!
ఈ వ్యవహారంపై ఇప్పటికే అక్టోబర్ 30న ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మైనింగ్, అటవీ, పర్యావరణ, ఆర్అండ్బీ శాఖల అధికారులతో సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. తవ్వకాల అనుమతులు, మొరం తరలింపు పరిమాణం, రాయల్టీ చెల్లింపులు, వాహనాల లోడింగ్ సామర్థ్యం, వృక్షాల తొలగింపు అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా రహదారి నిర్మాణానికి సంబంధించిన ఎంబీ రికార్డులు, నాణ్యతా పరీక్షల నివేదికలు, అధికారుల తనిఖీ వివరాలను పరిశీలించాలని కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులైన కాంట్రాక్టర్‌తోపాటు నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాల్సిన అభివృద్ధి పనులు దుమ్ము కాలుష్యానికి, పర్యావరణ విధ్వంసానికి కారణం కాకూడదని, జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని జూలపల్లి ప్రజలు కోరుతున్నారు.