పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సంగారెడ్డి, : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పటికే రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, మరో రెండు లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. పటాన్ చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకంజర్లలో ఆదివారం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇంట్లో కేక్ కట్ చేసి, లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారి ఇంట్లో భోజనం చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలులోకి వచ్చాయని అన్నారు. 1970లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు అసైన్డ్ భూములు అందించడం, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి పేదల సొంతింటి కలను సాకారం చేసిందన్నారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు పొందారని, కానీ ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి, రూ.46 వేల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు, రూ.16 వేల కోట్ల ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు పెండింగ్లో పెట్టారని అన్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల అమలులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలందరికీ సొంత ఇళ్లు అందించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇప్పటికే రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.చిన్నకంజర్లలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న ఈశ్వరమ్మ ఆయాగా పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో వర్షాకాలంలో ఇంట్లోకి నీళ్లు వచ్చి ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు. లబ్ధిదారుల జీవితాల్లో వస్తున్న ఈ మార్పు, వారి సంతోషమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తినిస్తుందని మంత్రి అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.పేద కుటుంబాల ఖర్చులు తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్హులకు పెన్షన్లు, సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం అందించడం వల్ల కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఆదా జరుగుతోందన్నారు.పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి, చదువులో రాణించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ఈ విధమైన బ్రేక్ఫాస్ట్ పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున అమలు కావడం లేదని తెలిపారు.ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందులో విద్యార్థులకు మెరుగైన తరగతి గదులు, క్రీడా మైదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించిందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుందని తెలిపారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నామని, అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.పటాన్చెరు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యువతకు మంచి ఉద్యోగాలు కల్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేసి, యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణతో పాటు రూ.2 వేల స్టైఫండ్ అందించే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. యువతకు నైపుణ్యాలు అందించి పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు పొందేలా చేయడమే లక్ష్యమని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరుపుకోవడం, లబ్ధిదారుల కుటుంబంతో కలిసి భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామాల్లో అవసరమైన రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు.