ఒకేరోజు మూడు పండుగల సంబరం! - దీపావళి వెలుగుల్లో సీఎం, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
సూర్య–జూలపల్లి:
మండల కేంద్రంలో ఆదివారం మూడు పండుగల సంబరం అంబరాన్నంటింది. దీపావళి పర్వదినంతో పాటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలు ఒకేరోజు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో సింగిల్ విండో చైర్మన్ లోక జలపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లోక జలపతిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే జన్మదినాలతో పాటు దీపావళి పండుగ ఒకేరోజు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావుకు జూలపల్లి మండలంతో విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు. 1995లో ఉమ్మడి జూలపల్లి మండలం నుంచి తొలిసారిగా జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన, 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా, 2023లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల ఆదరణ పొందారని గుర్తుచేశారు.
జూలపల్లి మండల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విజయరమణారావు.. సెంట్రల్ లైటింగ్, హుస్సేన్మియా వాగుపై వంతెన, గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన జూలపల్లి మండలాన్ని ఎన్నటికీ మరువబోనని చెప్పడమే కాకుండా, ఆ మాటను అభివృద్ధి పనుల ద్వారా ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు. రైతుల సంక్షేమానికి కూడా ఎమ్మెల్యే ప్రాధాన్యతనిస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గింజ కోత సమస్య లేకుండా కొనుగోళ్లు సాగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ఎమ్మెల్యే విజయరమణారావు ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాచాపూర్ ఉపసర్పంచ్ దాడి మనోహర్, సింగిల్ విండో డైరెక్టర్లు సిరికొండ కొమురయ్య, బుర్ర నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్మ పోచాలు, వార్డు సభ్యులు ఎదుల్ల కనకయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు గౌస్ పాషా, మాజీ వార్డు సభ్యులు గడ్డం కిష్టారెడ్డి, బండి స్వామి, చీదురు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పొట్టల శంకరయ్య, బొంగాని రమేష్, అజీజ్, ఇరుమల్ల రాములు, ఎలుకపెల్లి లచ్చయ్య, బండారి తిరుపతి, కొమ్మ రాజేశం, దీకొండ రమేష్, వేముల శ్రీనివాస్ తదితరులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.