మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో చట్టవిరుద్ధంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, పీసీపీఎన్‌డీటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ సోమవారం ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రామంతాపూర్‌లోని శ్రీ గాయత్రి కేంద్రాన్ని పరిశీలించి, పీసీపీఎన్‌డీటీ మార్గదర్శకాలను, రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.ఉప్పల్‌లోని యూవీ డయాగ్నస్టిక్ సెంటర్‌ను తనిఖీ చేసి నిర్వహణను పరిశీలించారు. అనంతరం బోడుప్పల్‌లోని 'మమత క్లినిక్'ను తనిఖీ చేయగా, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా, కనీస అర్హతలు లేని వ్యక్తి వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించి సదరు క్లినిక్‌ను తక్షణమే సీజ్ చేశారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ మాట్లాడుతూ,.. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనుమతులు లేకుండా కేంద్రాలు నడపడం, అర్హత లేని వ్యక్తులు వైద్యం అందించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
జిల్లాలోని ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాలు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు పొంది మార్గదర్శకాలను పాటించాలని, నిబంధనల ఉల్లంఘనలపై జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీత, జిల్లా ఎంసీహెచ్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ గీత, అదనపు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పవన్ రెడ్డి, డిప్యూటీ డెమో వసంత కుమారి తదితరులు పాల్గొన్నారు.