ఐడీబీఐ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ..
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్: లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని (ఏఐ బి ఓఏ) ఆల్ ఇండియా చైర్మన్ వి. అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. బ్యాంకును విదేశీ సంస్థకు అప్పగించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు, ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చేనెల నవంబర్ 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మె తో పాటు ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2003- 04లో బ్యాంకుగా మార్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వ వాటా 51 శాతానికి తగ్గకుండా కొనసాగిస్తామని పార్లమెంట్ లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ హామీకి విరుద్ధంగా ప్రైవేటీకరణకు ప్రయత్నించడం అన్యాయమన్నారు.
ఐడీబీఐకి దేశవ్యాప్తంగా 2,100 శాఖలు, 3 వేల ఏటీఎంలతో పాటు భారీ స్థిరాస్తులు ఉన్నాయని అనిల్ కుమార్ తెలిపారు.
ఉద్యోగ సంఘాలతో చర్చించకుండానే విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన 51 శాతం వాటాను కొనసాగించాలని, ఉద్యోగుల హక్కులు, సేవా నిబంధనలకు రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్లో జరిగే సమ్మెకు మద్దతు తెలపడంతో పాటు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే నిరాహార దీక్షలో ఉద్యోగులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏ ఐ బి ఓ ఏ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కె. మురళి, కార్యదర్శి సీతారామ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు సోమసుందర్, కమిటీ సభ్యుడు విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.