తుఫాన్ బాధితుల కన్నా రాజకీయాలు ముఖ్యమా..! * ప్రెస్ మీట్ లో మండలి విపక్ష నేత బొత్స *
విజయనగరం బ్యూరో, సూర్య : తుఫాన్ బాధితుల కష్టాలు కన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు రాజకీయాలు ముఖ్యమా అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తుఫాన్ వరదలతో ఒక వైపు రైతులు పంటలు పోయి అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. తక్షణమే తుఫాన్ బాధితులను ఆదుకోవాలని, రైతులకు పంట నష్టాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
మళ్ళీ రెండు రోజుల్లో తుఫాన్ ఉందని తెలుస్తోందని అన్నారు. గత ఏడాది కూడా తుఫాన్ నష్ట పరిహారం లెక్కలు అంచనాల వేసి తరువాత నష్టం తగ్గించి రైతులను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. చంద్ర బాబు పబ్లిసిటీ తప్ప వాస్తవంగా ఆదుకున్న దాఖలాలు లేవని ఏద్దేవా చేశారు. తుఫాన్ సమాచారం ముందే తెలిసినా, నష్ట తీవ్రతను తగ్గించే ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు విఫలమైందని మండిపడ్డారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్లో బియ్యం, నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నడూ లేని అరాచకాలు చేస్తోందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో అధికారులు, అనాధికారులు కుమ్మకై వైసీపీ అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించారని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థుల బీఫార్మ్ లు దాచేసి అధికారులు కూటమి వైపు కొమ్ము కాసారని తెలిపారు. కొందరు అధికారులు అనర్హులకు నకిలీ బీసీ సర్టిఫికెట్స్ మంజూరు చేయడం దారుణమన్నారు. అటువంటి తప్పుడు అధికారులను గుర్తించామని, భవిష్యత్ లో ఇదే కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండిపోదని, వారంతా తగిన మూల్యం చెల్లించుకుంటారని బొత్స హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి ఈ కూటమి ప్రభుత్వ పాలన తీరును ప్రజలు తమ ఓటుతో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ లోకేష్ తొడల్లుడు భూముల ఎలా దోచుకుంటున్నాడో అక్కడి ప్రజలు గుర్తించారని అన్నారు. విశాఖలో వైసీపీ మేయర్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ భూ దోపిడీని అడ్డుకుంటామని, దోచుకున్న భూములు వెనక్కితెచ్చి ప్రజా సంపద కాపాడతామన్నారు.
స్థానిక ఎన్నికల నేపధ్యంలో విజయనగరం జిల్లాలో ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాలకి తెర లేపారని బొత్స మండిపడ్డారు. జిల్లా రాజకీయాల్లో ఇలాంటి దుర్మార్గపు సంస్కృతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి, విలువలని జపించే అశోక్ గజపతి గారు ఈ చర్యలపై సమాధానం చెప్పాలని కోరారు. ఒకప్పుడు పార్టీలో రెండో స్థాయిలో ఉన్న అశోక్ గజపతి తన కార్యకర్తలు, నాయకులకు ఇలాంటి విలువలే నేర్పుతున్నారా అని బొత్స ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో అధికారులు, అనధికారులు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేసే ప్రయత్నాలు చేశారని, తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభ పెట్టీ, భయపెట్టి నామినేషన్లు విత్ డ్రాలు చేయించారని ఆరోపించారు. పూసపాటి రేగలో రాత్రి వరకు జాబితా విడుదల చేయకపోవడం, ఇచ్చిన బి ఫారా లు దాచేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని అరోపించారు. తెర్లాం, ఎల్ కోట. కొత్తవలస జడ్పీటీసీ అభ్యర్థులను ఎత్తుకుపోవడానికి యత్నించారని దాన్ని తానే స్వయంగా అడ్డుకున్నానని తెలిపారు. ఇలాంటి తుచ్చు రాజకీయాలు వద్దని హెచ్చరించారు. కొందరు ఎమ్మార్ లు తప్పుడు బీసీ సర్టిఫికెట్ లు ఇచ్చారని, దానిపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు.