రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: ప్రసిద్ధ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న యత్నాలపై బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయానికి అత్యంత చేరువలో బొగ్గు గని తవ్వకాల ప్రతిపాదనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తవ్వకాల వల్ల ఆలయ నిర్మాణ శైలికే కాకుండా, శతాబ్దాల చరిత్ర కలిగిన రామప్ప చెరువు ఉనికికి కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. మన సంస్కృతి, చరిత్రకు ప్రతీకలుగా నిలిచే వారసత్వ కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేసిన ఆయన, ఆలయ భద్రతను విస్మరించి ముందుకు సాగితే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.