బుడగజంగాలకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో నివసిస్తున్న బుడగజంగం కులస్తులకు ఎస్సీ (SC) వర్గానికి వర్తించే అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ ఫలాలను వెంటనే అందజేయాలని కోరుతూ బేడా బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు ఈబుతి బాలు మాట్లాడుతూ... 2008కి ముందు తమ కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఆ తర్వాత కొన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల నిలిపివేశారని తెలిపారు. దీనిపై గత 18 ఏళ్లుగా శాంతియుత పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. జేసీ శర్మ కమిషన్‌తో పాటు పలు నిపుణుల కమిటీలు విచారణ జరిపి బుడగజంగాలు ఎస్సీలేనని స్పష్టమైన నివేదికలు ఇచ్చాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని పరిగణనలోకి తీసుకుని కేంద్రానికి సిఫార్సులు పంపిందని, కేంద్ర స్థాయిలో చట్ట సవరణ జరిగే వరకు ఎస్సీలకు అందే ఉచిత విద్యుత్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం, రాయితీ రుణాలు, ఇతర పథకాలను బుడగజంగాలకు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలోని బుడగజంగం కుటుంబాలకు తక్షణమే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పెద్దోడు, మోతే జమ్మన్న, గనమద్దిలేటి, ఈబూతి సన్నీ, మధుసూదన్, రంగన్న, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూల్ జిల్లా