ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి – డా. చంటి ముదిరాజ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, పారదర్శకతను పెంపొందించాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ డిమాండ్ చేశారు.
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ. శ్రీకాంత్ రెడ్డి కలిసి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ డా. బి. రవీందర్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి నివారణ, పారదర్శకత, జవాబుదారీతనం, సమాచార హక్కు చట్టం–2005 అమలుపై ప్రతినిధి పత్రం సమర్పించారు.
రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్ల పరిపాలనా బాధ్యతలు, ప్రభుత్వ నిధుల వినియోగం, మందుల కొనుగోళ్లు, వైద్య పరికరాల సరఫరా, సిబ్బంది విధుల నిర్వహణ, రోగుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కమిటీ కోరింది. అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి, అక్రమాలు నిర్ధారణ అయిన సందర్భాల్లో బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
అలాగే, అన్ని సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమాచార హక్కు చట్టం–2005ను సమర్థవంతంగా అమలు చేయాలని, RTI దరఖాస్తులకు చట్టబద్ధమైన గడువులో సమాధానాలు అందించాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే సందర్భంగా సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ డా. బి. రవీందర్ నాయక్ గారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక (మెమెంటో) అందజేశారు.
“ప్రజాధనం ప్రజల ఆరోగ్యానికే వినియోగించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకతను బలోపేతం చేయాలి" అని డా. చంటి ముదిరాజ్ పేర్కొన్నారు.