ప్రజా నాయకుడు కన్నుమూత!
- నౌపడలో విషాదఛాయలు
- కన్నీరుమున్నీరైన అభిమానులు
- నాలుగు దశాబ్దాల టీడీపీ ప్రస్థానం.. కార్మికుల హక్కుల కోసం పోరాటం
- గ్రామ, మండల అభివృద్ధిలో చెరగని ముద్ర
కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి, సూర్య: ప్రజలతో మమేకమై, పేదల కష్టాల్లో పాలుపంచుకొని పార్టీ కోసం నాలుగు దశాబ్దాల పాటు అంకితభావంతో పనిచేసిన ప్రజా నాయకుడు కర్రి విష్ణుమూర్తి (70) కన్నుమూశారు. నిన్నటి వరకు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందడంతో నౌపడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన నాయకుడు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక అభిమానులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు సంతబొమ్మాళి మండల మాజీ ఎంపీపీ ప్రతినిధి, నౌపడ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కర్రి విష్ణుమూర్తి ఆదివారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. రాత్రి 9 గంటల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న ఆయన.. అనంతరం ఇంటికి వెళ్లి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించే సమయంలో గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. రోజంతా అందరితో కలివిడిగా గడిపిన వ్యక్తి అర్ధరాత్రి కల్లా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారీ కృష్ణవేణి భర్త విష్ణుకు తలకు తిరిగి పెట్టడంతో చూసినవారికి కంటతడి పెట్టించింది.
- నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన విష్ణుమూర్తి సుమారు 40 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నౌపడ గ్రామ సర్పంచిగా, మండల స్థాయిలో ప్రజాప్రతినిధిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ గ్రామ, మండల అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. పదవులు చేపట్టినా, రాజకీయంగా ఎదిగినా ఎక్కడా గర్వం ప్రదర్శించకుండా సామాన్యుడిలా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆయన ప్రత్యేకత. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలకు చేరువయ్యారు.
- కార్మికుల హక్కుల కోసం పోరాటం
ఉప్పు కార్మికుల సమస్యలపై పోరాడుతూ, వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన విష్ణుమూర్తి కార్మిక సంఘం నాయకుడిగానూ గుర్తింపు పొందారు. ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికుల సంక్షేమం, గ్రామ అభివృద్ధి వంటి అంశాల్లో ఆయన చేసిన సేవలను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. అధికార హోదాలు, రాజకీయ బాధ్యతలు ఎన్నో నిర్వహించినప్పటికీ సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తూ, తనకు చేతనైన సాయం చేసేందుకు ముందుండే వ్యక్తిగా ఆయనకు పేరుంది.
- కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్న పెద్దమనిషి
వ్యక్తిగత జీవితంలోనూ విష్ణుమూర్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఏడాది క్రితం కుమారుడు నాగిరెడ్డిని కోల్పోయినప్పటికీ, ఆ బాధను దిగమింగుకొని ఆయన పిల్లలైన తన మనవడు, మనవరాలి బాధ్యతలను స్వీకరించారు. ముగ్గురు కుమార్తెల తండ్రిగా కుటుంబానికి అండగా నిలిచారు. కుమారుడి మరణంతో కుంగిపోయిన కుటుంబానికి ధైర్యాన్నిస్తూ, మనవడు, మనవరాలి భవిష్యత్తు కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిలింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ప్రజా జీవితం, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సాగిన ఆయన ప్రస్థానం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
- విష్ణుమూర్తి కుటుంబానికి అండగా మంత్రి అచ్చెన్నాయుడు
విష్ణుమూర్తి మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెంటనే నౌపడలోని ఆయన స్వగృహానికి చేరుకొని పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విష్ణుమూర్తి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందించిన నాయకుడి మరణం పార్టీకి తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు.
- పార్టీలకతీతంగా సంతాపం
విష్ణుమూర్తి మృతి పట్ల టీడీపీ మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు అటాడ రాంప్రసాద్, సీనియర్ నాయకుడు వాడరేవు కృష్ణమూర్తి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామానికి, మండలానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.
ప్రజల మధ్యే జీవించి ప్రజలతోనే తన ప్రస్థానాన్ని కొనసాగించిన విష్ణుమూర్తి ఆకస్మిక మరణం నౌపడ గ్రామానికి తీరని లోటుగా మారింది. నిన్నటి వరకు తమ మధ్య తిరిగిన నాయకుడు నేడు విగతజీవిగా కనిపించడంతో అభిమానుల హృదయాలు బరువెక్కాయి. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాకపోయినా, ప్రజలతో పెంచుకున్న అనుబంధం శాశ్వతమని చాటిన విష్ణుమూర్తి జ్ఞాపకాలు గ్రామస్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.