రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:కోర్టులో కేసు నడుస్తున్నా తన భూమిని చదును చేస్తున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుద్యాల మండలం హకీంపేట గ్రామానికి చెందిన రైతు దోరమోని పూజవెంకటయ్యను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పరామర్శించారు. రైతుల అనుమతి లేకుండా భూములను స్వాధీనం చేసుకుంటూ వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కొడంగల్ ప్రాంత రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో రైతు భూమిని చదును చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల భూములను స్వాధీనం చేసుకునే ముందు నిబంధనల ప్రకారం పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, వారి హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని రైతులకే న్యాయం జరగకపోతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల రైతులకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందని నిలదీశారు.రైతు సాగు చేస్తున్న వరి, కంది పంటలకు నీరు అందకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు. భూములను కోల్పోతామనే ఆందోళనతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో రైతులకు అన్యాయం చేయడం తగదని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, బాధిత రైతుకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సైతం రైతుకు తోడుగా నిలుస్తారని తెలిపారు. రైతుల భూములు, పంటలు, జీవనాధారాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ పరామర్శ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.