స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి
మెలియాపుట్టి, సూర్య: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతోపాటు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా ముందుకు సాగేందుకు గ్రామాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవాలన్నారు. మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు కల్పించడంతోపాటు, పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని రెడ్డి శాంతి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, ప్రజల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీకి బలమైన పునాదులు ఏర్పరచుకోవడం ద్వారా ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా ఐకమత్యంతో పనిచేయాలని, గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆమె సూచించారు.