కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు
- భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
- సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా
- సామాన్య భక్తులకు దర్శనంలో ప్రథమ ప్రాధాన్యత
- జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి
కోటబొమ్మాళి, అక్టోబర్ 12, మేజర్ న్యూస్: మూడు రోజులపాటు రాష్ట్ర పండుగగా నిర్వహించే కొత్తమ్మతల్లి అమ్మవారి ఉత్సవాలకు జిల్లా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, పోలీసు అధికారులకు ఆదేశించారు. భక్తుల భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సమన్వయంతో వ్యవహరిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి సోమవారం సాయంత్రం విధి నిర్వహణపై ఆయన దిశానిర్దేశం చేశారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని, ఆలయానికి వెళ్లే మార్గాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు, క్యూ లైన్లు, బాంబ్ డిస్పోజల్ టీమ్ తనిఖీ ఏర్పాట్లు, వీఐపీ భద్రత, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, గ్రామీణ క్రీడా, సాంస్కృతిక మైదానాలు, హెలిప్యాడ్ ఎగ్జిబిషన్ ప్రాంతాలను పరిశీలించి భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ దర్శనానికి అవకాశం కల్పించాలన్నారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చూడాలని, భక్తుల వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్ర, గ్రామీణ క్రీడలు, ఎగ్జిబిషన్, హెలికాప్టర్ టూరిజం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సమయంలో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రత్యామ్నాయ సిబ్బంది విధుల్లోకి వచ్చే వరకు తమ పాయింట్లను విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని బందోబస్తును నిరంతరం పర్యవేక్షిస్తూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉత్సవాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, కొత్తమ్మతల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి లక్ష్మణరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ ఇమ్మాన్యూల్ రాజ్, టెక్కలి రూరల్, అర్బన్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్, విజయ కుమార్, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు