పదేళ్ల సంబరాలు కాదు.. పదేళ్ల దగా ఉత్సవాలు
సిద్దిపేట రూరల్,మేజర్ న్యూస్: సిద్దిపేటలో అభివృద్ధి పేరుతో దోపిడీ జరిగిందని బీజేపీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి లింగాల జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి భయం పట్టుకోవడంతోనే ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంబరాల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో అభివృద్ధి జరిగిందంటూ గొప్పలు చెప్పుకోవడం కాదని, ప్రజలకు జరిగిన మేలు ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు. మద్యం గోదాంలో కార్మికుల పనుల కోసం అనుచరులు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రంగనాయకసాగర్ ప్రాజెక్టు, కాలువల నిర్మాణంలో రైతులకు పరిహారం చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు.సురక్ష పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలను అధిక మొత్తాలకు విక్రయించారంటూ విమర్శించారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, అభివృద్ధి పనులు ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా జరుగుతాయని, వాటన్నింటినీ తన ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు. పైపై మెరుగులు చూపించి అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకోవడం తగదని పేర్కొన్నారు.సిద్దిపేట పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం ద్వారా నిధులు వచ్చాయని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లోనూ అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సంబంధిత నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జనార్దన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల ఉపాధ్యక్షుడు గుర్రం రాజిరెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు తాడేపు కమ్మ శ్రీనివాస్, మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కలకుంట్ల నవీన్, ఎస్సీ మోర్చా జిల్లా నాయకుడు పాపగారి కనకయ్య, కిసాన్ మోర్చా మండల నాయకుడు మొకిల్ల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
(సిద్దిపేట రూరల్, రమేష్)