కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త"
హైదరాబాద్: తెలంగాణలో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. దసరా, దీపావళి పండుగల ముందు ప్రభుత్వం ఏదైనా శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్న ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వం పిడుగు లాంటి వార్త తీసుకొచ్చిందని ఆయన అన్నారు.
కరెంటు బిల్లుల రూపంలో ప్రజలపై రూ. 5,420 కోట్ల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. కరువు, ఎల్‌నినో, పెరిగిన నిత్యావసర ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన మండిపడ్డారు.
ఈ మేరకు 'ఎక్స్' వేదికగా స్పందించిన హరీశ్‌రావు, "పండుగల సమయంలో ఏ ప్రభుత్వమైనా శుభవార్తలు చెబుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాతలు పెడుతోంది" అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కోతలు, ప్రజలకు వాతలు మిగిలాయని ఎద్దేవా చేశారు.
విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపవద్దని, పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
Also Read: బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం