డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి మరో మూడు నూతన పేటెంట్లు.
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల విద్యార్థులు, తమ డిగ్రీ కోర్సులో భాగంగా చివరి సెమిస్టర్ లో అనుభవ పూర్వక అభ్యాసం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా, కోర్సు ఇంచార్జి డా. ఇమ్మాన్యూల్ మార్గదర్శకత్వంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రూపొందించిన తేనె పట్టు మైనం ఆధారిత వినూత్న ఉత్పత్తులపై ఇప్పటివరకు మొత్తం ఆరు (6) పేటెంట్లను సాధించి, పరిశోధనల్లో సరికొత్త మైలురాయిని ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు అధిగమించారు. ఈ క్రమంలో ఈ రోజు, బీ వ్యాక్స్ షూ పాలిష్ , ఫర్నిచర్ పాలిష్, హెయిర్ కండిషనర్ మూడు ఉత్పత్తులపై మూడు కొత్త పేటెంట్లు మంజూరై, అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్ ప్రాసెస్ విద్యార్థులు సాధించిన ఈ ప్రతిష్టాత్మక విజయంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. కే ధనుంజయరావు, రిజిస్ట్రార్ డా. బి. ప్రసన్న కుమార్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. ఎస్. సూర్యకుమారి, వెంకటరామన్న గూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్ బి వి చలపతిరావు, జాయింట్ రిజిస్ట్రార్ వి. ఆనందబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉప కులపతి మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మకతను, శాస్త్రీయ నైపుణ్యాన్ని మేళవించి నూతన వ్యాపార ఆలోచనలను వెలికితీయడంలో ఈ ప్రయోగాత్మక అభ్యసన ప్రక్రియ ఎంతగానో తోడ్పడిందని కొనియాడారు. ఈ బృందానికి మార్గదర్శకులుగా వ్యవహరించిన మెంటార్ డా. ఎన్. ఇమ్మాన్యూల్ అద్భుత ప్రతిభ కనబరిచిన ఇఎల్పి విద్యార్థులను వైస్ ఛాన్సలర్ ప్రత్యేకంగా అభినందించారు.
రిపోర్టర్: శ్రీనివాస్ తాడేపల్లిగూడెం. పశ్చిమ గోదావరి జిల్లా