గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్
గ్రామ గడపకే వైద్యం.. రాష్ట్రవ్యాప్తంగా 267 ఆరోగ్య మందిరాలను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్!
నందివాడ, మేజర్ న్యూస్ :
గ్రామీణ ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితికి కూటమి ప్రభుత్వం చరమగీతం పాడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ను మంగళవారం మంత్రి సత్యకుమార్ యాదవ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఇదే వేదిక నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లోని 267 విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఒకేసారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకంతో అసంపూర్తిగా ఆగిపోయిన ఆరోగ్య మందిరాల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,400 క్లినిక్ ల పూర్తికి రూ.1,128.02 కోట్లు కేటాయించామని, ఈ విడత 267 భవనాలకు రూ.105 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో మిగిలిన భవనాలు పూర్తి చేసి, ఈ ఏడాది చివరి నాటికి 2,700 కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి ఆరోగ్య మందిరంలో 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు, 71 రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని, 'సంజీవని' పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డులు కల్పిస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ గడ్డపై ఆరోగ్య పండుగ: ఎమ్మెల్యే రాము
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడలో ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. గుడివాడ నియోజకవర్గంలో 41 ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేస్తున్నామని, నేడు ఒకేసారి 10 క్లినిక్ లు ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు.
20 ఏళ్లలో ఏం చేశావ్? కొడాలికి యార్లగడ్డ సవాల్
ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 20 ఏళ్లు అధికారంలో ఉండి గుడివాడకు ఏం చేశావని సవాల్ విసిరారు. మైకు కనిపిస్తే బూతులు తప్ప నాని నోట ఏమీ రాదని, ఎన్టీఆర్ పుట్టిన గడ్డకు ఆయన మాటలు అవమానమని మండి పడ్డారు. రాము ఒక్క ఎన్నికలో తెచ్చిన 53 వేల మెజారిటీ ముందు నాని గత మెజారిటీలు దిగదుడుపే అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు.