దేచుపాలెంలో రూ.31 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం ప్రారంభం
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
వత్సవాయి మేజర్ న్యూస్:- దేచుపాలెం గ్రామంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ – వెల్‌నెస్ హెల్త్ క్లినిక్ భవనాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రారంభించారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు.
రూ.31 లక్షల అంచనా వ్యయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో దేచుపాలెం గ్రామ ప్రజలకు ప్రాథమిక వైద్యం, ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, అవసరమైన వైద్య సేవలు మరింత సులభంగా అందనున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య మౌలిక వసతులను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ప్రజలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆరోగ్య పరీక్షలతో పాటు వ్యాధులపై అవగాహన, ముందస్తు గుర్తింపు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సేవలు ప్రజలకు అందించడంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమంతో పాటు వైద్య ఆరోగ్య రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, కనపర్తి పాపారావు, మన్నె నారాయణరావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.