BREAKING
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పై ఎన్ డి పి ఎస్ యాక్ట్ నిర్భంద ఉత్తర్వులు ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం తొంబై శాతం సబ్సిడీ తో స్ప్రింక్లర్స్ పంపిణీ స్వర్ణ గిరిలో కలుశ పంచామృత అభిషేకం* క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘాతో అడుగులు వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం…

కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు

Select Suryaa Now
కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు

మిగిలిన రోడ్లు, డ్రెయిన్లన్నీ పూర్తి చేస్తాం.. గ్రామాల అవసరాలే ప్రాధాన్యంగా అభివృద్ధి: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 
కోవూరు నియోజకవర్గంలో 217 పనులకు సుమారు రూ.10 కోట్లు – కొడవలూరులో 56 పనులు
పల్లె పండుగ 1.0, 2.0లో కొడవలూరు మండలానికి సుమారు రూ.1.18 కోట్ల పనులు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.11 వేల కోట్లకు పైగా చొప్పున నిధులు – జలజీవన్‌కు రూ.30 వేల కోట్లు
కిసాన్‌ సెజ్‌తో స్థానిక యువతకు ఉపాధి – చక్కెర కర్మాగారం సమస్య పరిష్కారానికి చర్యలు
స్థానిక ఎన్నికల్లో 24 పంచాయతీలతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి విజయమే లక్ష్యం

కోవూరు,  మేజర్ న్యూస్ :    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామాల్లో ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉందో గుర్తించి దశలవారీగా పనులు చేపడుతోందని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు. పల్లె పండుగ 1.0, 2.0లో కొడవలూరు మండలంలో సుమారు రూ.1.18 కోట్ల పనులు చేపట్టామని, ఇప్పుడు పల్లె పండుగ 3.0లో మరో రూ.2.06 కోట్ల పనులు మంజూరయ్యాయని వెల్లడించారు. మంగళవారం కొడవలూరు మండలం తాటాకులదిన్నెలోని ఎస్సీ కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

ప్రతి గ్రామ అవసరానికీ ప్రాధాన్యం  :  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గారు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే గారు అన్నారు. గత రెండేళ్లుగా ప్రజల అవసరాలను తెలుసుకుని రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని, పల్లె పండుగ మూడు దశల్లోనూ కొడవలూరు మండలానికి ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కింద మొత్తం 217 పనులకు సుమారు రూ.10 కోట్లు కేటాయించామని, ఇందులో కోవూరు మండలంలో 32, ఇందుకూరుపేటలో 36, కొడవలూరులో 56, విడవలూరులో 46, బుచ్చిరెడ్డిపాలెంలో 47 పనులు చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వానికి ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందని, ఈ కాలంలో మిగిలిపోయిన రోడ్లు, డ్రెయిన్లను గుర్తించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

పనుల్లో నాణ్యత విషయంలో రాజీ లేదు  :  మంజూరైన పనులను ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, బాధ్యతలు తీసుకున్న వారు తమ సొంత గ్రామ పనులుగా భావించాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ‘ఇది మన ఊరు.. ఇది మన పని’ అనే బాధ్యతతో వ్యవహరిస్తూ రహదారులు, డ్రెయిన్లు తదితర పనులను అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. గ్రామస్తులు కూడా పనుల నాణ్యతను పర్యవేక్షించాలని కోరారు.

సంక్షేమం.. అభివృద్ధి రెండు సమపాళ్లలో  :  రాష్ట్ర పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్లకు పైగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరో రూ.11 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వివరించారు.

ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు  :  జలజీవన్‌ మిషన్‌ కోసం తాజాగా రూ.30 వేల కోట్లు విడుదల కావడంతో గ్రామాల్లో తాగునీటి పనులు మరింత వేగవంతం కానున్నాయని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎక్కడ నీటి సమస్య ఉన్నా గుర్తించి పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని, రాబోయే రోజుల్లో నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చారు.

కిసాన్‌ సెజ్‌తో యువతకు స్థానికంగానే ఉపాధి  :  కొడవలూరు మండలంలోని కిసాన్‌ సెజ్‌లో ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు వస్తాయని, స్థానిక యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటికి సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. విద్యా రంగంలోనూ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని, విద్యార్థులకు మెరుగైన విద్య, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలతో పాటు పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను పెంచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ గారు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

చక్కెర కర్మాగార సమస్యకు పరిష్కారం  :  కొడవలూరు మండలంలోని చక్కెర కర్మాగారానికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గారు వెల్లడించారు. కర్మాగార బకాయిలను త్వరలో చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, శిథిలావస్థలో ఉన్న కర్మాగారం స్థానంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

24 పంచాయతీల్లో కూటమి జెండా ఎగరాలి  :   రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొడవలూరు మండలంలోని 24 పంచాయతీలతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. ఎవరు అభ్యర్థులుగా నిలబడినా గ్రామంలో ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి యువత గత రెండేళ్లలో జరిగిన పనులను, ప్రభుత్వ పనితీరును ఒకసారి బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.