ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట
సూర్య, సెంటినరీ కాలనీ :ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట వేస్తుందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అన్నారు. సెంటినరీ కాలనీ వాసుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సుమారు రూ.07 కోట్లతో పోతన కాలనీ ఫిల్టర్ బెడ్ నుంచి సెంటినరీ కాలనీ ఫిల్టర్ బెడ్ వరకు సుమారు 8.2 కిలోమీటర్ల నూతన తాగునీటి పైపు లైన్ పనులకు మంగళవారం స్థానిక సోలార్ మెయిన్ కంట్రోల్ కార్యాలయ సమీపంలో రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం సుంకర మధుసూదన్ మాట్లాడుతూ గతంలో ఉన్న పైప్ లైన్ వేసి చాలా కాలమైనందున తరచూ మరమ్మత్తులు రావడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని, అందుచేత నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కాలనీలో తాగునీటి సరఫరాను మరింత మెరుగు పరిచేందుకు నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమం తో పాటు వారి కుటుంబాల సౌకర్యాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం. రామచంద్ర రెడ్డి, బెల్లం శ్రీనివాస్, ఎస్వోటు జీఎం యం. రామ్మోహన్, సివిల్ డిజిఎం ఎస్.రవికుమార్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, అధికారులు మనోజ్ కుమార్, డి.శ్రీనివాస్, కాంట్రాక్టర్ మాధవరావు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.