గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని వినియోగించుకోవాలి
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
జలదంకి,మేజర్ న్యూస్ : గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి సూచించారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా గట్టుపల్లి సెక్టార్ చింతలపాలెం మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సిడిపిఓ పద్మజాకుమారి ఆదేశాల మేరకు కార్యకర్తలు కామేశ్వరమ్మ, భానుమతిల ఆధ్వర్యంలో మంగళవారం అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మనం జరుపుకుంటున్న అంగన్వాడి పోషణ్ మాసోత్సవం ముఖ్య ఉద్దేశం సమాజంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడం, ప్రతి ఒక్కరికి ఆరోగ్య పై అవగాహన కల్పించడమేమన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సేవలను ప్రతి గర్భిణీ, బాలింత సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుడ్లు, పాలు, బలవర్ధకమైన అన్నం క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. కిశోర బాలికలు, గర్భిణీలు రక్తహీనత బారిన పడకుండా ఐరన్ టాబ్లెట్లు వాడాలన్నారు. అలాగే ఆకుకూరలు, స్థానికంగా దొరికే పండ్లు తినాలన్నారు. పిల్లల శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆటపాటల విద్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్యం అనేది ఒకరి బాధ్యత కాదని, అందరం కలిసికట్టుగా ఆరోగ్య సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం గట్టుపల్లి పీహెచ్ సి వైద్యాధికారులు షేక్ సాయిష్ట అమ్రిన్, షేక్ నూర్ భాషా, ఎన్ వి సతీష్ లు మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు తల్లులు ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకుంటూ వైద్య సిబ్బంది అందించే సూచనలు సలహాలు పాటించాలని కోరారు. మిల్లెట్స్ వాడకం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వాడాలని సూచించారు. అనంతరం గర్భిణీలు బాలింతలను అంగన్వాడీ కార్యకర్తలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.