ర్యాగింగ్‌కు నో చెప్పండి.. స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మిద్దాం
ర్యాగింగ్‌కు నో చెప్పండి.. స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మిద్దాం
తారా ప్రభుత్వ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం
సంగారెడ్డి: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల (ఎ)లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ర్యాగింగ్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు యాంటీ ర్యాగింగ్ ఓరియంటేషన్ కార్యక్రమంతో పాటు అవగాహన పోస్టర్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, ర్యాగింగ్‌ను అరికట్టాల్సిన ఆవశ్యకత, కళాశాలలో అమలులో ఉన్న యాంటీ ర్యాగింగ్ నిబంధనలు, విద్యార్థుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సుచిత్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. తోటి విద్యార్థులను గౌరవిస్తూ, పరస్పర సహకారం మరియు స్నేహభావంతో ముందుకు సాగాలని తెలిపారు. కళాశాలను ర్యాగింగ్ రహిత విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.యాంటీ ర్యాగింగ్ మరియు డిసిప్లిన్ కమిటీ కన్వీనర్ డా. అశ్విని మాట్లాడుతూ ర్యాగింగ్ తీవ్రమైన నేరమని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు సంబంధించిన ఏదైనా ఘటనను గమనించినా, ఎదుర్కొన్నా వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించాలని సూచించారు.కార్యక్రమంలో యాంటీ ర్యాగింగ్ మరియు డిసిప్లిన్ కమిటీ సభ్యులు డా. మిథున్, డా. వినోద్, డా. సోలమన్, డా. వీరేందర్, డా. రవీందర్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ అంశంపై అవగాహన పోస్టర్ల తయారీకి అవసరమైన సూచనలు అందించారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని అందించేలా పోస్టర్లను రూపొందించేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు. ఉత్తమ పోస్టర్లను ఎంపిక చేసి, వాటిని రూపొందించిన విద్యార్థులకు 9వ తేదీన సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కళాశాలలో సురక్షితమైన, స్నేహపూర్వక, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు విద్యార్థుల్లో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.“ర్యాగింగ్‌కు నో చెప్పండి – స్నేహపూర్వక విద్యా వాతావరణాన్ని నిర్మిద్దాం” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.