అంగన్వాడీ ఉత్సవం–పిఎం మాతృ వందన యోజనపై అవగాహన
గూడూరు(ఇల్లకూరు), మేజర్‌న్యూస్ : ప్రధానమంత్రి ప్రజాసేవ 25 వసంతాలు పూర్తైన సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం చిల్లకూరు మండల పరిధిలోని వల్లిపేడు 1,2 పల్లమాల, ఉడతావారిపాళెం, అంకులపాటూరు, రామారెడ్డిపాళెం, కోవూరువారిపాళెం గ్రామాల్లో నిర్వహించారు. తొమ్మిదవ జాతీయ పోషణ మాసోత్సవాలతో అనుసంధానంగా గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. థీమ్–5 ప్రకారం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పిఎంఎంవివై) పథకంపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషణ, ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న మాతృ సంక్షేమ పథకాలపై ప్రతి తల్లికి అవగాహన ఉండాలని, అర్హులైన వారు వాటి ప్రయోజనాలను పొందాలని సూచించారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకంలో లబ్ధి పొందేందుకు అవసరమైన అర్హతలు, నమోదు విధానం, అవసరమైన వివరాలు, పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు, అర్హులైన లబ్ధిదారులకు నగదు ప్రోత్సాహకం అందే విధానం గురించి తల్లులకు వివరించారు. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. తల్లి, శిశువు ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను సకాలంలో వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా వచ్చి సేవలు పొందుతున్న పిల్లల తల్లులను గుర్తించి, వారిని పండుగ వాతావరణంలో ఘనంగా సన్మానించారు. అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు అందిస్తున్న సేవలను గుర్తించిన తల్లులు కూడా వారిని సన్మానించి అభినందించారు. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో కార్యకర్తలు వాణి, పరమేశ్వరి (వల్లిపేడు), సుస్మిత (పల్లమాల), మానస(ఉడతావారిపాళెం), నిర్మలమ్మ(అంకులపాటూరు), ముని కుమారి (రామారెడ్డిపాళెం), మస్తానమ్మ(కోవూరువారిపాళెం), సహాయకులు సునీత, మణెమ్మ, ఆశ కార్యకర్తలు నీరజ, కస్తూరమ్మ, గర్భవతులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.