గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
జి.కొండారెడ్డిపల్లిలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
వరికుంటపాడు, మేజర్ న్యూస్ : వరికుంటపాడు మండలం, జి.కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో 15వ ఆర్థిక సంఘం (15th Finance) నిధులు రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్‌ను గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ఆశీర్వచనాల మధ్య రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రంలోని శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ముఖ్యంగా పేదలు, సామాన్య ప్రజలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జి.కొండారెడ్డిపల్లిలో నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు మరియు వృద్ధులకు అవసరమైన ఆరోగ్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. రూ.36 లక్షల నిధులతో నిర్మించిన ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి ఒక భరోసా కేంద్రంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.