ఎస్‌ఐఆర్ అక్రమాలపై వజ్రేష్ యాదవ్ సమరశంఖం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం తన స్వతంత్రతను పూర్తిగా కోల్పోయిందని ఆరోపిస్తూ, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఏఐసీసీ, ఇండియా కూటమి పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
“ఓటు హక్కుతో చెలగాటం ఆడితే ఊరుకోం”
ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ,.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాథమిక పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటును కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఒక్క అర్హుడి ఓటు హక్కును తొలగించినా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం, అనర్హుల పేర్లను చేర్చడం వంటి చర్యలకు ఎలాంటి తావులేకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓటు హక్కును బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు.
“కేంద్రం ప్రజాస్వామ్యాన్ని హరిస్తోంది”సీపీఎం జిల్లా కార్యదర్శి పి. సత్యం: ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని మండిపడ్డారు.సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్: కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడం శోచనీయమని, ఓటర్ల హక్కుల పరిరక్షణకు పోరాటం తప్పదని స్పష్టం చేశారు.
“అవకతవకలు వెలుగులోకి వచ్చే వరకు పోరాటం”:
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న ప్రతి అవకతవకను ప్రజల ముందుకు తీసుకువచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వజ్రేష్ యాదవ్ ప్రకటించారు. ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు అవసరమైతే ఇండియా కూటమి ఆధ్వర్యంలో మరింత పెద్దఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
భారీగా తరలివచ్చిన 'ఇండియా' కూటమి నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ (మాస్ లైన్) నాయకుడు సదానందం, టీజేఎస్ నాయకుడు లక్ష్మారెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రవికుమార్, మల్కాజ్‌గిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి రామకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వీరితో పాటు జిల్లా ఆర్టియే సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, అలియాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ నియోజకవర్గాల డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యూత్ కాంగ్రెస్, ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ సెల్‌ల ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.
పి.బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.