సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం
ప్రొద్దుటూరు, అక్టోబర్ 6 మేజర్ న్యూస్:
ప్రొద్దుటూరులో సోమవారం జరిగిన జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార కార్యక్రమం ‘ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్’ అన్న చందంగా జరిగిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాష విమర్శించారు. మంగళవారం స్థానిక ఇస్లాంపురం వీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరులో అనేక కళాశాలలు, యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వాటిని విస్మరించి రూ.30 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రారంభించడం కేవలం అంకెల గారడీగా కనిపిస్తోందని విమర్శించారు. అమరజీవి జలధారకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టినప్పటికీ కార్యక్రమ ప్రాంగణంలో ఆయన చిత్రపటం ఎక్కడా కనిపించకపోవడం బాధాకరమన్నారు. ఇది పొట్టి శ్రీరాములుకు అవమానంగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రొద్దుటూరుకు వచ్చిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. ప్రజాధనంతో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించడం దారుణమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిన పనులను పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారని, అయితే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హయాంలో చేపట్టిన ఎనిమిది అభివృద్ధి పనుల్లో బ్రిడ్జి, ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్ వంటి కొన్ని పనులు మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రొద్దుటూరుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, నూతన తాగునీటి పైప్‌లైన్, మెడికల్ కాలేజీ అవసరం ఉందని, గత ప్రభుత్వం మంజూరు చేసిన 18 వేల ఇళ్ల పట్టాల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా శక్తి పథకం అమలు పరిస్థితిపై కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ప్రొద్దుటూరు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పూర్తయినప్పటికీ మిగిలిన అరకొర పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ యువకుడిగా ప్రశంసించినంత మాత్రాన ప్రజలకు ప్రయోజనం ఉండదని, వాస్తవంగా అభివృద్ధి పనులు జరిగితేనే దాని ఫలితం ప్రజలకు అందుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రొద్దుటూరు అభివృద్ధికి ఎవరు కృషి చేస్తున్నారో ప్రజలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని, అభివృద్ధి ఆధారంగానే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
- షేక్ మహమ్మద్ రఫీ మేజర్ న్యూస్ ప్రొద్దుటూరు