వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రామతీర్థంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం
రైతులు, మత్స్యకారులు, మహిళలతో కలిసి యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే
రాష్ట్రవ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు
కోవూరు నియోజకవర్గంలో ఈ ఏడాది పంటలు బాగా పండాయి.. రైతుల్లో ఆనందం
కోవూరు, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, మత్స్యకారులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు, మత్స్యకారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. రైతులు, మత్స్యకారులు అధికంగా ఉన్న విడవలూరు మండలంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ప్రత్యేకమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అందులోనూ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇందుకోసం ఎంపిక చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వాముల ఆధ్వర్యంలో వరుణ జపం, యాగం నిర్వహించామని, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. వరుణ దేవుడి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, మత్స్యకారులకు మంచి రోజులు రావాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గారి కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో ఈ ఏడాది రైతులు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే గారు తెలిపారు. విడవలూరు మండలంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పంటలు బాగా పండాయని, రైతుల ముఖాల్లో ఆ సంతోషం కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా పుట్టి వడ్లకు రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలుకుతోందని, ఇంత మంచి ధర గతంలో ఎప్పుడూ చూడలేదని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇకపై కూడా ఇదే విధంగా ప్రకృతి అనుకూలించి పంటలు బాగా పండాలని, రైతులకు మంచి దిగుబడులతో పాటు గిట్టుబాటు ధరలు లభించాలని శాసనసభ్యులు ప్రశాంతి రెడ్డి గారు ఆకాంక్షించారు. రైతులు, మత్స్యకారులు, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించారు.