భూ సేకరణ పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలి కానంపల్లి చెరువు, పెద్దపల్లి బైపాస్‌పై కలెక్టర్ సమీక్ష
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ; అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి అటవీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మారం మండలం కానంపల్లి చెరువు భూ సేకరణను వేగవంతం చేయాలని, పెండింగ్ అంశాలను శాఖల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యలను తెలుసుకుని పరస్పర అవగాహనతో పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులకు రైతులు సహకరించాలని కోరిన కలెక్టర్ భూములు కోల్పోతున్న వారికి చట్టం, నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ బి. గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.