క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ !
-వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా
-కాల్ సెంటర్లను బలోపేతం చేయాలి
-విద్యుత్ ప్రమాదాలను నిరోధించేందుకు చర్యలు
-విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి నిరంతర సమీక్ష
-ఎంఎన్ఆన్ఇ గణాంకాల మేరకు లక్ష సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు అభినందనీయం
-ఎపిఎస్పిడిసిఎల్ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి గొట్టిపాటి వెల్లడి
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఏపీఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మంగళవారం నాడు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎపిఎస్పిడిసిఎల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ దిశగా పయనిస్తుండడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 100 గిగావాట్ల ఇంధన ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయని, ఈ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఎల్నినో ప్రభావంతో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపైనే ఆధారపడడంతో విద్యుత్ కొరతతో కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ విద్యుత్ రంగ అధికారులు, సిబ్బంది కృషితో సమస్యల్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అధికారులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలను చేపట్టడం జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి నిరంతర సమీక్ష
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందిండంతోపాటు పిఎం సూర్యఘర్ పథకం కింద రాష్ట్రంలోని 6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను అమర్చే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. రూఫ్ టాప్ సోలార్ పనులను సకాలంలో పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఎన్ఆన్ఇ గణాంకాల మేరకు ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై కేవలం 6 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో ఒక లక్ష సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా రూఫ్ టాప్ సోలార్ అంశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం నాల్గవ స్థానంలో నిలవడం గొప్ప విషయమన్నారు. జాతీయస్థాయిలో విద్యుత్ రంగాన్ని అగ్రగామిగా నిలపడమే ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం వుందని, విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ఆయన ప్రాధాన్యతనిస్తున్నారని వివరించారు.
ఆర్డిఎస్ఎస్ పనులు వేగవంతం
ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో పునరుత్పాదక విద్యుత్ పంపిణీ పథకం (ఆర్డిఎస్ఎస్) కింద విద్యుత్ వ్యవస్థ బలోపేతం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించినట్లయితే సంబంధిత కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల్లో వేగాన్ని పెంచాలని, నాణ్యతలో ఎటువంటి రాజీ వుండబోదని తెలియజేశారు. పిఎం-కుసుమ్ పథకం కింద ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ పనుల్ని వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. తద్వారా రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు.
సేవా కేంద్రాన్ని బలోపేతం చేయాలి
విద్యుత్ పంపిణీ సంస్థల్లో విద్యుత్ వినియోగదారుల సేవాకేంద్రం (1912)ను బలోపేతం చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు సూచించారు. వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యుత్ సమస్యలు సత్వరం పరిష్కారం అయ్యే విధంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ ప్రక్రియలో వినియోగదారులకు సకాలంలో సమాచారం అందే విధంగా అధికారులు అసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించడం ద్వారానే వినియోగదారుల సంతృప్త స్థాయిని పెంచేందుకు అవకాశం వుంటుందన్నారు.
విద్యుత్ ప్రమాదాలను నిరోధించండి
రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని మంత్రి సూచించారు. నివాస సముదాయాల్లో విద్యుత్ లైన్లు చేతికి అందే ఎత్తులో వుండడం, ప్రమాదకర స్థితిలో ట్రాన్స్ ఫార్మర్లు వున్న ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసే సందర్భంలోని ఇటువంటి ప్రమాదాల నేపధ్యాన్ని ముందుగానే గ్రహించి తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు చోరీకి గురికాకుండా సాంకేతికంగా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
పారిశ్రామిక వినియోగదారులకు సత్వర సేవలు
విద్యుత్ సంస్థల పరిధిలో పారిశ్రామిక వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని మంత్రి సూచించారు. వినియోగదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, సర్వీసులను త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులను సకాలంలో మంజూరు చేయాలని, రైతుల పండ్ల తోటలు దెబ్బతినకుండా అధికారులు, సిబ్బంది తమవంతు సహకారాన్ని అందించాలని సూచించారు. విద్యుత్ రంగంలో పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా సబ్-స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ముందుగా స్థల సేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా సబ్-స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఎపిఎస్పిడిసిఎల్లో 46 మందికి కారుణ్య నియామక పత్రాల పంపిణీ
ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో కారుణ్య నియామకాల కింద 46 మందికి ఉద్యోగల నియామక పత్రాలను మంగళవారం సంస్థ కార్పొరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమిష్టి కృషి కారణంగానే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో కారుణ్య నియామకాల ప్రక్రియలో భాగంగా గత యేడాది డిసెంబరు 22న 50 మందికి, ఈ యేడాది ఏప్రిల్ 24న 18 మందికి, తాజాగా నేడు మరో 46 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు. కూటిమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎపిఎస్పిడిసిఎల్లో 215 మందికి కారుణ్యనియామకాల కింద ఉద్యోగ అవకాశాలను కల్పించామని వివరించారు. విద్యుత్ ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సంస్థను మరింత అభివృద్ధిపథంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎపిఎస్ పిడిసిఎల్ డైరెక్టర్ (టెక్నికల్) కె. గురవయ్య, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటి)పి. అయూబ్ ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణా దేవి, ఆర్. పద్మ, ఎన్. శోభావాలెంటీనా, సిహెచ్ రామచంద్రరావు, ఎం. మురళీకుమార్, కె. సంపత్ కుమార్, ఎస్. రమణ, ఎ. శ్రీనివాసబాబు, ఎం. శ్రీకాంత్, జి. సుధాకర్ బాబు, ఓఎస్ డి ఎం. ఉమాపతి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కె. జనార్ధన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.