బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం!
-ఆర్టీసీ కండక్టర్‌పై మహిళ సంచలన ఆరోపణలు
-రూ.20 లక్షల నగదు, బంగారం తీసుకున్నారని ఫిర్యాదు
-లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి ఆరోపణ
-తిరుపతి ఆర్ఎంకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
బస్సులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని నమ్మించి తనను మోసం చేశారని ఓ మహిళ ఆర్టీసీ కండక్టర్‌పై ఆరోపణలు చేశారు. ప్రేమ పేరుతో తన వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల వరకు నగదు, బంగారం తీసుకున్నారని, అనంతరం తనను ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే కండక్టర్‌పై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తిరుపతి ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు.
చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెకు చెందిన ఎం. బేబీ శాలిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి తనకు ఎదురైన సమస్యను వివరించారు. న్యాయం చేయాలని మంత్రిని కోరారు.
బస్సు ప్రయాణంలో పరిచయం..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను చంద్రగిరి నుంచి తిరుపతికి ప్రతిరోజూ బస్సులో ప్రయాణించే సమయంలో ఆర్టీసీ కండక్టర్ వి. సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ పరిచయాన్ని సుబ్రహ్మణ్యం క్రమంగా పెంచుకుని.. తాను ప్రేమిస్తున్నానని నమ్మించారని ఆరోపించారు.
తనపై నమ్మకం కలిగించిన అనంతరం వివిధ సందర్భాల్లో తన నుంచి నగదును తీసుకున్నారని, ఫోన్‌పే ద్వారా పలుమార్లు డబ్బులు బదిలీ చేయించుకున్నారని బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా తనతో బంగారం కూడా కొనిపించుకున్నారని తెలిపారు. తన వద్ద నుంచి తీసుకున్న నగదు, బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు.
లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణ
ప్రేమిస్తున్నానని చెబుతూ తన వెంటపడి.. తనపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. ఈ పరిణామాలతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, తనకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు.తన ఆరోపణలకు ఆధారాలుగా ఉన్న ఫోన్‌పే లావాదేవీల వివరాలు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బంగారం కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇతర ఆధారాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఆర్ఎంకు మంత్రి వీడియో కాల్.. విచారణకు ఆదేశం
బాధితురాలు తన సమస్యను వివరించిన వెంటనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుపతి ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వీడియో కాల్ చేసి ఈ వ్యవహారంపై వివరించారు. బాధితురాలు చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, సంబంధిత కండక్టర్‌పై ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజలకు సేవలందించే ఆర్టీసీ సిబ్బంది విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ప్రయాణికులతో, ముఖ్యంగా మహిళలతో మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి ఫిర్యాదులను తేలికగా తీసుకోకుండా పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్ఎంను ఆదేశించారు.భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, సిబ్బంది ప్రవర్తనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. బాధితురాలికి చట్టపరంగా న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మహిళల భద్రత, గౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని.. బాధితులకు అండగా ఉంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.