గాంధీ మార్గంలో నడవాలి
జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శిల్ప
పరిగి సబ్‌జైలులో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్ (అక్టోబర్ 2): ప్రతి ఒక్కరూ జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అనుసరించి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని పరిగి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శిల్ప సూచించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి సబ్‌జైలులో జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పుట్టుకతో ఎవరూ నేరస్తులు కారని, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు, చెడు స్నేహాలు వారిని తప్పుదారి పట్టించే అవకాశం ఉందన్నారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండి, మంచి వారితో స్నేహం చేయడం ద్వారా మంచి మార్గంలో నడవవచ్చని సూచించారు. “తన కోపమే తనకు శత్రువు.. తన శాంతమే తనకు రక్ష” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. క్షణికావేశంలో చేసే చిన్న తప్పులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని, చేసిన తప్పును పునరావృతం చేయకుండా మార్పు దిశగా ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ... ఖైదీల సంక్షేమం, పునరావాసం కోసం జైళ్లలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు చదువురాని ఖైదీలకు విద్య నేర్పిస్తున్నామని, బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలు తెరిపిస్తున్నామని చెప్పారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించి బెయిల్ పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఖైదీల శారీరక ఆరోగ్యం కోసం పీటీ, పరేడ్, యోగా నిర్వహిస్తున్నామని, వారానికి రెండుసార్లు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని పేర్కొన్నారు. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పరిగి సీఐ కొండల్‌రెడ్డి, జిల్లా న్యాయ సేవా సంస్థ డిఫెన్స్ కౌన్సెల్ వెంకటేష్, రాము, పరిగి కోర్టు లీగల్ న్యాయవాది గౌస్ పాషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తకుమార్, హెడ్ వార్డర్ సుధాకర్, వార్డర్లు రాజు, నరేష్, హరికృష్ణ, విద్యా వాలంటీర్ చుక్కాని బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఖైదీలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.