తురకపల్లిలో ప్రపంచ ఉద్యాన కేంద్రం.. రాయలసీమ అభివృద్ధికి కీలక ముందడుగు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు.. యువతకు ఉపాధి అవకాశాలు
అనంతపురం న్యూ టౌన్ రిపోర్టర్ (తిరుపతి సురేష్)
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో ప్రపంచ ఉద్యాన కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన రాయలసీమ రైసింగ్ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ.. తురకపల్లిలో ప్రపంచ ఉద్యాన కేంద్రం ఏర్పాటు రాయలసీమ అభివృద్ధికి కీలక ముందడుగుగా నిలవనుందని అన్నారు. ఉద్యాన రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలపై అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు.
మామిడి, అరటి, చీనీ, దానిమ్మ, బత్తాయి వంటి ఉద్యాన పంటల సాగులో ఆధునిక విధానాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పంటల నాణ్యత, దిగుబడులను పెంచేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. పంటల నిల్వ, నాణ్యత ఆధారంగా వర్గీకరణ, ప్యాకింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అనుబంధ రంగాలు అభివృద్ధి చెందితే రైతులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఉద్యాన పరిశోధనలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం ఏర్పాటుతో తురకపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారులు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత పెరగనుందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పారిశ్రామిక రంగాలను సమన్వయం చేస్తూ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తురకపల్లిలో ప్రపంచ ఉద్యాన కేంద్రం ఏర్పాటుతో రాయలసీమలో ఉద్యాన రంగానికి కొత్త దిశ ఏర్పడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుత్తి మండలానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.