national
పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమంపై కర్ణాటక మంత్రి తీవ్ర ఆరోపణలు
బెంగళూరు: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్‌లో అధిక మొత్తంలో ఇథనాల్ కలుపుతున్నాయని కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన నమూనాల ల్యాబ్ పరీక్షల్లో పెట్రోల్‌లో గరిష్టంగా 31.2 శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వం నిర్ణయించిన 20 శాతం (E20) పరిమితి కంటే 31.2 శాతం వరకు ఇథనాల్ వాడటం వల్ల వాహనాల మైలేజీ 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతోందని, దీనివల్ల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారుల అవసరాలకు తగినట్లు E10, E20 లేదా స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.