telangana
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి - అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ప్రజావాణి లాగిన్లోని దరఖాస్తులన్నింటినీకి నిబంధనల ప్రకారం తగిన సమాధానాలు పంపేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రు తో కలిసి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి, భూ సంబంధ, ఇతర సమస్యలపై జిల్లా స్థాయిలో 11, మండల స్థాయిలో 9 దరఖాస్తులు రావడం జరిగిందని వెల్లడించారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో 30 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను గుర్తించి, తక్షణమే వాటిని క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఎక్కడా ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అలాగే నిర్దేశిత లక్ష్యాలను షెడ్యూల్ ప్రకారం యథావిధిగా, సకాలంలో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికల, బాలుర హాస్టళ్లలో మెనూ అమలు, రికార్డుల నిర్వహణ, మౌలిక వసతులపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా భోజన వసతులు, ఇతర అంశాలపై ఫిర్యాదులు వచ్చినందున ప్రత్యేక కాంప్లెక్సులు, హాస్టళ్లలో క్షుణ్ణంగా పరిశీలన నిర్వహించాలని ఆదేశించారు. హాస్టళ్ల తనిఖీలలో ఏవైనా లోపాలు లేదా ఇబ్బందులు గుర్తిస్తే, వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి తక్షణ విచారణ చేపట్టి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణిలో డిఆర్ఓ స్రవంతి, డీఆర్డీఓ రవీందర్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ మనోహర్, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, అర్జిదారులు, తదితరులు పాల్గొన్నారు