telangana
28వ రోజుకు చేరుకున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగస్తుల సమ్మె
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, యూరోపియన్ స్కీం ఏఎన్ఎంల నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ప్రభుత్వంపై ఎన్ హెచ్ఎం ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారం ద్వారా నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతన స్కేల్ వర్తించేలా తమ క్యాడర్ ఫిక్సేషన్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చేయాలని తాము శాంతియుత నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని అన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవుని ఆశీస్సులకు ప్రతి ఒక్క ఉద్యోగి తమ కోరికలను ఒక తెల్లని పేజీలో రాసి పంపించారు. భగవంతుడా ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, తమ NHM ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం పరిష్కరించేలా ఆశీస్సులివ్వాలని రాసారు. రిలే దీక్షల్లో సైతం పలువురు ఉద్యోగులు కూర్చుకొని తమ నిరసన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా NHM జేఏసీ అధ్యక్షుడు సుమన్, జేఏసీ నాయకులు పద్మజ, డా.హరీశ్, డా.వేణుమాధవ్, డా.రాహుల్, సందీప్, అఖిల్, శివ, పండరి, బాలు, స్వర్ణలత, శోభ, భారతి, శారద, లక్ష్మీ, సువర్ణ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.